చెలీ
నా కనుపాపల పల్లకీ నెక్కించి
స్వప్నవీధులగుండా
గుండె నెత్తావులను వెదజల్లుతూ
నేను నలుగురినై
జీవితం పందిట్లోకి
మోసుకుపోతాను
నా గాఢ పరిష్వంగం వెచ్చదనాన
ఒదిగి పొదిగిన నిన్ను
ప్రేమాధి రోహణ అనుభూతుల్లో
జగమంతా ఊరేగిస్తాను
అలసి సొలసి
నిట్టూర్పుల సెగలో చలికాచుకుంటూ
కందిన నీ లే చెక్కిళ్ళగులాబీ రెక్కలమాటున
మధుపంగా ఒదిగిపోతాను
ఏళ్ళ క్రితం చూపుల రాయభారాల్లోని
నిశ్శబ్ద గమకాల్ను శృతి చేసి
రాగం కట్టిన పాట రక్త నాళాలను చేదించుకుంటూ
పెల్లుబికి వస్తోంది.
అత్తరు సువాసనల అట్టడుగునో
గాజు గోళీ కళ్ళకావలి తీరంలోనో
సముద్రంలా అడ్డంగా పరచుకున్న లోకానికి
ఈ వైపునో ఆ వైపునో
ఇంకా నీ నవ్వు సవ్వడి గాలానికి
నన్ను నేను తగిలించుకుంటూనే వున్నాను
నడి రాతిరి ఇల్లంతా పరచుకున్న ఏకాంతం
అడుగడుగునా నీ పాదాల ఒత్తిడి
రాత్రిని జ్ఞాపకాల మూసలో కరిగించి నీ కోసం
పుటం పెట్టిన అక్షరాలను
ఆభరణాలుగా మెరుగులు పెడుతున్నాను
ఏ అలసిన ఉదయపు క్షణాల్లోనో
ఓ చల్లని ఓదార్పు లా నీ స్పర్శ
లాలిస్తుందన్న ఆశతో
కను రెప్పలు మేను వాలుస్తున్నాయి
గాలి అల్లరిగా సంధించిన
ఉలి ములుకుల్లా నిశ్శబ్దంగా దూసుకు వచ్చి
నీ రూపం పచ్చబొట్టు
నా ఉనికిపై చెక్కుతున్నాయి
చెలీ
ఇహ నేనెక్కడ?
ఇటూ అటూ ఎటు చూసినా
నీజ్ఞాపకాలే
No comments:
Post a Comment